Priyanka Gandhi Ed Case : నగదు అక్రమ చలామణీ అభియోగాలతో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఈ మనీలాండరింగ్ కేసులో ప్రియాంక పేరును ప్రస్తావించిన ఈడీ ఇటీవలే ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా జత చేసింది.
దిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా హరియాణాలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన వాద్రా తర్వాత సంజయ్ భండారీ మిత్రుడు NRI, వ్యాపారవేత్త సీసీ థంపికి విక్రయించినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. 2006లో ఫరీదాబాద్‌లో ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, 2010లో ఆ భూమిని అదే ఏజెంట్‌కు విక్రయించడంలో ప్రియాంక ప్రమేయం ఉందని ఈడీ తన అభియోగాల్లో తెలిపింది. ఆ ఏజెంట్ కొంత భాగాన్ని థంపికి కూడా విక్రయించాడని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ లావాదేవీలు వాద్రా, థంపి మధ్య భాగస్వామ్య సంబంధాలు, పరస్పర వ్యాపార ప్రయోజనాలను వెల్లడి చేస్తున్నాయని తన అభియోగాల్లో తెలిపింది. భండారీ తన అక్రమ ఆర్జనతో లండన్‌లో దక్కించుకున్న 12 బ్రియాన్‌స్టోన్ స్క్వేర్ అనే ఇంటికి రాబర్ట్ వాద్రా మరమ్మతులు చేయించారని, అందులో నివాసం కూడా ఉన్నారని ఈడీ మంగళవారం ఆరోపించింది. బ్రిటన్‌కు చెందిన సుమిత్ చడ్ఢా అనే వ్యక్తి, వాద్రాకు ఈ వ్యవహారంలో సహకరించారని చెప్పింది. ఈ కేసులో నిందితుడైన భండారీ 2016లోనే బ్రిటన్‌కు పారిపోయారు. ఆయన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది.