దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్న సీబీఎస్‌ఈ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అండగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు బలవంతంగా పరీక్షలు పెడుతూ సీబీఎస్‌ఈ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పరీక్షలను రద్దు చేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా బోర్డు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"వైరస్ వ్యాప్తి ప్రబలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను బలవంతంగా పరీక్షలకు కూర్చోమనడం సీబీఎస్‌ఈ లాంటి బోర్డుల బాధ్యతారాహిత్యమే. బోర్డు పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాలి. లేదంటే విద్యార్థులు భౌతికంగా హాజరయ్యే అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించాలి."
- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
'పరీక్షా పే చర్చ'పై విమర్శలు..
ఈ సందర్భంగా మోదీ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంపై ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విద్యార్థుల్లో నెలకొన్న ఒత్తిడిపై కేవలం సదస్సుల్లో మాట్లాడితే సరిపోదని, అందుకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆమె అన్నారు. 'దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ.. ఈ పరీక్షల ఒత్తిడి చిన్నారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సదస్సులు, సమావేశాల్లో మాటలు చెప్పడానికి బదులు మన విద్యావిధానంలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల పట్ల కఠినంగా ఉండకుండా.. కరుణ చూపించాలి' అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.