Priyanka Gandhi congress president: దేశ సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ మేధోమథనం కొనసాగిస్తోంది. ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవడానికి సామాజిక న్యాయ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో కొనసాగుతున్న నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలనే అంశంపై తెరపైకి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేత ప్రమోద్ కృష్ణం డిమాండ్ చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా.. ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు యూపీ నేతలు. అయితే.. అజెండాలో లేని అంశాలు మాట్లాడవద్దని సూచించారు కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్ ఖర్గే. మరోవైపు.. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రమోద్ కృష్ణం. అయితే అలాంటి చర్చలకు ఇక్కడ ఆస్కారం లేదని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే.
నేటితో ముగింపు..: మూడు రోజుల కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శివిర్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆరు ప్రధాన అంశాలపై నేతలు మేధో మథనం జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆరు కమిటీలు రూపొందించిన సిఫార్సుల ముసాయిదాలను ఆదివారం.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అందించనున్నారు కమిటీల చైర్మన్లు. ఉదయం 11 గంటలకు భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఆరు కమిటీలు ఇచ్చిన సిఫారసులు, తీర్మానాలను వర్కింగ్ కమిటీలో ప్రవేశపెట్టనున్నారు సోనియా గాంధీ. రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాలకు ఆమోదం తెలపనుంది సీడబ్ల్యూసీ. ఆదివారం మధ్యాహ్న 3 గంటలకు చింతన్ శిబిరానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రశాంగించునున్నారు రాహుల్ గాంధీ. అనంతరం నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల ముగింపు ఉపన్యాసంలో కీలక ప్రకటన చేయనున్నారు సోనియా.
కాంగ్రెస్‌కు కీలకం కానున్న ఉదయపుర్ డిక్లరేషన్:రాజకీయ ఎత్తుగడలు, రంగాల వారీగా నూతన విధానాలు, సంస్థాగత మార్పులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్.. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ,యువజన, పార్టీ సంస్థాగత అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 శాతానికిపైగా యువకులకు ఇవ్వాలని భావిస్తోంది. తక్షణమే పార్టీ అధికారంలోకి రావడం కంటే మరో రెండు వందల ఏళ్ల పాటు బలంగా ఉండేలా నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. అవసరమైతే పార్టీ పగ్గాలు కూడా యువతకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు సోనియా గాంధీ. చట్టసభల్లో ఎక్కువగా యువత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు.