కొవిడ్ వివరాలను వెల్లడించడంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించట్లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మహమ్మారికి సంబంధించిన విషయాలను సమగ్రంగా తెలియజేయకుండా గుట్టుగా ఉంచుతోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజల ప్రాణాల కంటే ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
"మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రధాన మంత్రి ప్రతిష్ఠను కాపాడుకోవడమే ప్రధానంగా ప్రభుత్వం భావిస్తోంది. మహమ్మారి ప్రారంభం నుంచి కూడా కరోనా వివరాలను ప్రభుత్వం తమ ప్రచారానికి తగిన విధంగా ఉపయోగించుకుంటోంది. మృతులు, పాజిటివ్ కేసులను జనాభా నిష్పత్తి ప్రకారం వెల్లడిస్తూ.. టెస్టింగ్ వివరాలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నమే ఇదంతా. వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది."
-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత