Prisoners Hotel : ఆ టిఫిన్ సెంటర్లో మొత్తం ఖైదీలే కనిపిస్తారు. వంట చేసేది వారే.. వడ్డించేదీ వారే. పాత్రలను శుభ్రం చేసుకునేది కూడా వాళ్లే. అదేంటి ఖైదీలు.. జైలులో లేకుండా అక్కడేం చేస్తున్నారని అనుకుంటున్నారా?.. మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఎరవాడ జైలులో ఉంటున్న పలువురు ఖైదీలు టిఫిన్ సెంటర్ ప్రారంభించారు. అందులో అన్ని పనులు వారే చూసుకుంటున్నారు. ఖైదీలు వండుతున్న రుచికరమైన ఆహారాన్ని తినేందుకు స్థానికులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఉదయం టిఫిన్స్.. మధ్యాహ్నం స్నాక్స్..
ఎరవాడ జైలులోని ఖైదీలతో అధికారులు.. శృంఖల ఉపాహర్ గృహ్ పేరుతో టిఫిన్ సెంటర్ను ఆగస్టు 9న ప్రారంభించారు. ఎరవాడ జైలు అధికారి అమితాబ్ గుప్తా చొరవతో ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభమైంది. ఖైదీలు ప్రారంభించిన టిఫిన్ సెంటర్లో మొత్తం 24 మంది పనిచేస్తున్నారు. ఉదయం పూట అన్ని రకాల టిఫిన్లు, టీ అమ్ముతున్నారు. మధ్యాహ్న సమయంలో బజ్జీలు, పకోడీ విక్రయిస్తున్నారు. మొదట్లో నాన్వెజ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మినప్పటికీ ఇప్పుడు వెజ్ మాత్రమే విక్రయిస్తున్నారు. మొదట్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత రద్దీ భారీగా పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ విక్రయిస్తున్న ఆహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జైలు అధికారులు తెలిపారు. ఖైదీలు ప్రారంభించిన టిఫిన్ సెంటర్కు ఫినోలెక్స్ కంపెనీ.. విలువైన వంట సామగ్రిని ఉచితంగా అందించిందని చెప్పారు.
'అందరం కలిసి ఆడుతూ పాడుతూ..'
జైల్లో ఎంత పనిచేసినా.. రోజు గడిచినట్లే అనిపించేదికాదని .. కానీ ఇప్పుడు రోజు ఎప్పుడు అయిపోతుందో తెలియట్లేదని ఖైదీలు చెబుతున్నారు. అందరం కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటున్నామని.. అన్ని రకాల వంటలు నేర్చుకున్నామని తెలిపారు. నాలుగు గోడల మధ్య జీవితానికి, బయటి జీవితానికి ఎంతో తేడా ఉందని చెప్పారు. స్పేచ్ఛ అంటే ఏంటో బయటకు వచ్చాకే తెలుస్తోందన్నారు. ఖైదీలు నడుపుతున్న టిఫిన్ సెంటర్లో ఆహారం ఎంతో రుచిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కొత్తగా దుకాణం ప్రారంభించినట్లు అస్సలు లేదని.. కొన్నేళ్లుగా షాప్ నడుపుతున్నట్లే ఆహారం ఉంటోందని అంటున్నారు.