తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక- 'హత్య' దోషికి 28 రోజుల పెరోల్ - సంతానోత్పత్తి హక్కు ఖైదీ

Prisoner Procreate Right : ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తూ భార్య వేసిన పిటిషన్​పై విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Prisoner Procreate Right
Prisoner Procreate Right

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 7:19 AM IST

Prisoner Procreate Right : జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుందని దిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు వారికి కూడా ఉంటుందని స్పష్టం చేసింది. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతడి భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు దాటిపోతుందని దిల్లీ హైకోర్టు తెలిపింది. వయోభారం ఆ దంపతుల ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంతశర్మ అభిప్రాయపడ్డారు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని చెప్పారు. ప్రస్తుత హత్య కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తీర్పులో తెలిపారు.

అయితే కోర్టు దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు జస్టిస్ స్వర్ణ కాంతశర్మ వెల్లడించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడం సహా ఒకరి షూరిటీ ఇవ్వాలని కండీషన్ పెట్టారు.

విడాకులకు అంగీకరించి వెనక్కి తగ్గడం క్రూరత్వమే!
పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న విడాకుల ఒప్పందం నుంచి భార్య లేదా భర్త ఏకపక్షంగా, అర్ధంతరంగా వైదొలగడం క్రూరత్వమే అవుతుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకుండా విడాకులు పొందడానికి సమ్మతించిన ఓ మహిళ భర్త నుంచి కొంత మొత్తం నగదును పొందిన తర్వాత ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడం సహా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌, జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

అహంభావమే ఆ దంపతుల మధ్య వైరానికి కారణమని, భర్తపై కక్షసాధించాలన్న భావన కూడా ఒప్పందం నుంచి వైదొలిగేలా భార్యను పురికొల్పిందని ధర్మాసనం పేర్కొంది. వివాదాలు పరిష్కారమవుతాయని భర్తను నమ్మించి మోసం చేయడం కూడా క్రూరత్వంలో భాగమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. భర్త కుటుంబంపై తొందరపాటుతో కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. దీంతోపాటు భార్య దాఖలు చేసిన అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.

ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోతున్నది.. ఈ 7 కారణాలతోనే!

బీ అలర్ట్‌ : మీరు విడాకుల వైపు పయనిస్తున్నట్టే - ఈ సూచనలు దానికే సంకేతం!

ABOUT THE AUTHOR

...view details