Prisoner Escaped In Agra Uttar Pradesh : ఉత్తర్ప్రదేశ్.. ఆగ్రాలో విచిత్ర ఘటన జరిగింది. జైలు నుంచి కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్లిన ఓ నిందితుడు.. కానిస్టేబుల్కు పూటుగా మద్యం తాగించి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది.. సీతాపుర్ జిల్లా నైమిశారణ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర్ గ్రామానికి చెందిన ఫుర్కాన్ అనే వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు తీసుకొచ్చిన ఇతర ఖైదీలను మళ్లీ జైలుకు తరలించారు. కానీ ఫుర్కాన్, అతడితో ఉన్న కానిస్టేబుల్ ఉమానాథ్ శ్రీవాస్తవ తిరిగి జైలుకు వెళ్లలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వీరి కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో స్టేషన్ సమీపంలో కానిస్టేబుల్ ఉంటున్న అద్దె గది వద్దకు జైలు లాకప్ ఇంఛార్జ్, పోలీసులతో వెళ్లారు. అక్కడి వెళ్లిన పోలీసులు కంగుతిన్నారు. కానిస్టేబుల్ మద్యం మత్తులో పడి ఉన్నాడు. ఫుర్కాన్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో లాకప్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.