భాజపా సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజానీకానికి, భాజపా శ్రేణులకు అడ్వాణీ ఓ సజీవ ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. 93వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న అడ్వాణీ.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అడ్వాణీకి పుష్పగుచ్చం ఇస్తున్న ప్రధాని "దేశాభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు విశేష సేవలందించిన ఎల్‌కే అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఆయన ఆదర్శప్రాయుడు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను." అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
అడ్వాణీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న మోదీ
పుట్టిన రోజు సందర్భంగా అడ్వాణీ నివాసానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్లారు. అడ్వాణీతో ఆత్మీయంగా ముచ్చటించిన ఇరువురు నేతలు.. కేక్ కట్ చేయించారు. మోదీ, షాలతో పాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అడ్వాణీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
అడ్వాణీతో ముచ్చటిస్తున్న నేతలు
ఎల్‌కే అడ్వాణీ 1927 నవంబరు 8న కరాచీలో జన్మించారు. భారత్ విభజన తర్వాత అడ్వాణీ కుటుంబం భారత్‌లో స్థిరపడింది. భాజపా వ్యవస్థాపక సభ్యుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయీతోపాటు ఈయన కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఈయనే. జాతీయ రాజకీయాల్లో పార్టీ ఎదుగుదలకు అడ్వాణీ చాలా కృషి చేశారు.
మోదీ చేతుల మీదుగా అడ్వాణీ పుట్టినరోజు వేడుక
ఇదీ చూడండి:కొత్త అధ్యక్షుడొచ్చాడు సరే! కానీ భారత్కేంటి?