వయోజనులందరికీ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. టీకాలు వేసే బాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని తెలిపారు. వ్యాక్సిన్ కొనుగోలుకు అయ్యే ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నెల 21 నుంచి ఉచిత టీకా ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
"ఉత్పత్తిదారుల నుంచి టీకాలు కొని రాష్ట్రాలకు అందిస్తాం. టీకాల భారం నుంచి రాష్ట్రాలకు పూర్తి విముక్తి కలిగిస్తాం. వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సొంత ఖర్చుతో టీకా వేసుకునే వారికి ప్రైవేటు రంగంలో అవకాశం కల్పించాం. ఇందుకుగాను ఆయా ఆసుపత్రులు సర్వీస్ ఛార్జి రూ.150 వసూలు చేయవచ్చు. టీకాల ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటు రంగంలో అందుబాటులో ఉండనున్నాయి."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
దేశంలో ప్రస్తుతం 7 కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మరో 3 కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్నారుల టీకా కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా వేసే టీకా కోసం ప్రయోగాలు ఊపందుకున్నట్లు పేర్కొన్నారు.