ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకానికి సంబంధించి 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయా, జమ్ముకశ్మీర్, అండమాన్- నికోబార్ ప్రాంతాలకు చెందిన పలువురు రైతులతో మాట్లాడారు.
'కనిపించని శత్రువుతో పోరాటం'
కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కనిపించని శత్రువుతో పోరాడుతోందని.. రెండో దశ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
"ఈ మహమ్మారి ప్రపంచాన్ని పరీక్షిస్తోంది. గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న బాధలను నేను అర్ధం చేసుకోగలను. మీ వంతు అవకాశం వచ్చినప్పుడు వ్యాక్సిన్లు తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.