PM Modi: అఫ్గానిస్థాన్‌లోని సిక్కు-హిందూ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు.. దిల్లీ 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందించారు. అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావటంపై కృతజ్ఞతలు తెలిపారని పీఎంఓ వెల్లడించింది. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై ప్రధాని మాట్లాడారని పేర్కొంది. సిక్కు సమాజానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది.
అలాగే.. గురు గ్రాంత్ సాహిబ్‌ను గౌరవించుకునే సంప్రదాయం ప్రాముఖ్యతను మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది పీఎంఓ. అందులో భాగంగానే అఫ్గాన్ నుంచి గురు గ్రాంత్ సాహిబ్ స్వరూప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. కొన్నేళ్లుగా అఫ్గాన్లు తమ పట్ల చూపిస్తున్న ప్రేమను, తాను కాబుల్ వెళ్లిన సందర్భాన్ని మోదీ గుర్తు చేసుకున్నట్లు చెప్పింది.
గత ఏడాది అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన నిదాన్ సింగ్ సచ్దేవ్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.