Heeraben Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ.. వందో పడిలోకి అడుగుపెట్టారు. 1923 జూన్ 18న ఆమె జన్మించారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు మోదీ. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.
ఆమెకు మిఠాయి తినిపించిన ప్రధాని.. తల్లితో కాసేపు సరదాగా గడిపారు. హీరాబెన్ మోదీ కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ మార్చిలో గుజరాత్ పర్యటన సందర్భంగా.. తల్లిని చివరిసారి కలిశారు ప్రధాని. తన తల్లి శతవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక బ్లాగ్ రాసుకొచ్చారు. తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం అమ్మ చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అమ్మ అంటే.. కేవలం పదం మాత్రమే కాదని, భావోద్వేగాల సమాహారమని అన్నారు. ప్రతి తల్లిలాగే తన మాతృమూర్తి కూడా ఎంతో సాధారణంగా కన్పించే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో కేవలం రెండే రెండు సార్లు తన తల్లి తనతో పాటు బహిరంగ సభలో కనిపించారని తెలిపారు. ఏక్తా యాత్ర తర్వాత శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి గుజరాత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి బహిరంగ సభలో పాల్గొని నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారని చెప్పారు. ఆ తర్వాత 2001లో తాను గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో రెండోసారి బహిరంగ సభలో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.
అమ్మ నేర్పిన జీవిత పాఠమిదే: ''చదువు లేకపోయినా జీవితాన్ని నేర్చుకోవచ్చని తెలిసేలా చేసింది అమ్మే. ఒకసారి నాకు చదువు చెప్పిన టీచర్లు అందరినీ సన్మానించాలని నేను అనుకున్నా. మా అమ్మ నాకు అతిపెద్ద టీచర్. అందుకే ఆమెనూ సన్మానించాలని ఆహ్వానించా. కానీ ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తన బదులు నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన స్థానిక టీచర్ ఒకరిని గౌరవించమని చెప్పారు. ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి.'' అని మోదీ రాసుకొచ్చారు.