ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు (Modi Italy visit 2021) శుక్రవారం బయలుదేరారు. అక్టోబర్ 30-31 తేదీల్లో రోమ్‌లో జరగనున్న జీ20 సమావేశంలో (G20 Summit 2021) పాల్గొంటారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు జీ20 సదస్సుకు హాజరవుతున్నారు.
ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాన్ని.. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జీ20 సభ్యదేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సవాళ్లపై చర్చించనున్నారు.
పర్యటన పూర్తి వివరాలు..
రోమ్కు చేరుకోగానే (Modi Italy visit 2021) మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న పియాజా గాంధీ ప్రాంతానికి మోదీ వెళ్లనున్నారు. అక్కడ మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు. ప్రధానితో పాటు ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా అక్కడికి వెళ్తారు. రోమ్ మేయర్ రాబర్టో గువాల్టిరీ సైతం పియాజా గాంధీ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది.