తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటేసిన ప్రధాని మోదీ.. నడుచుకుంటూ వెళ్లి, క్యూలో నిల్చుని.. - గుజరాత్​ ఎన్నికలు ఫలితాలు

గుజరాత్​ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల్లో ఓటు వేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ పరిధిలో ఉన్న రాణిప్​ నిషాన్​ స్కూల్​లో.. సాధారణ ఓటర్లలాగే వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని. అనంతరం మాట్లాడిన మోదీ.. పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు.

gujarat election 2022
gujarat election 2022

By

Published : Dec 5, 2022, 11:07 AM IST

Updated : Dec 5, 2022, 12:43 PM IST

ఓటేసిన ప్రధాని మోదీ.. ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా పోలింగ్​ కేంద్రానికి

గుజరాత్​ శాసనసభకు జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ పరిధిలో ఉన్న రాణిప్​ నిషాన్​ స్కూల్​లో ఆయన ఓటు వేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా పోలింగ్​ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్లలాగే వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని. అనంతరం మాట్లాడిన మోదీ.. పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొన్న గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్, దిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఆయన సోదరుడు సోమా మోదీ ఇంటికి వెళ్లారు ప్రధాని. అంతకుముందు ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ముఖ్యంగా యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్​లోని రాయ్​సన్​ ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. మోదీ సోదరుడు సోమాభాయ్​ మోదీ సైతం రాణిప్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

ప్రజలకు అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రానికి వస్తున్న మోదీ

ఓటేసిన కేంద్ర హోమంత్రి షా, ముఖ్యమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అహ్మదాబాద్​లోని నరన్​పురా పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు బీసీసీఐ సెక్రటరీ జై షా సహా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. శిలాజ్​ అనుపమ్​ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​.

ఓటు వేసిన షా, కుటుంబ సభ్యులు
ఓటు వేసిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​

ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14జిల్లాల పరిధిలోని 93నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఈనెల ఒకటిన 89స్థానాలకు పోలింగ్‌ జరగగా.. 63.34 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల కంటే 3శాతానికిపైగా ఓటింగ్‌ శాతం తగ్గింది. రెండో విడత పోలింగ్‌ జరగనున్న 93 స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఓటింగ్‌ కోసం 36,000 పైగా ఈవీఎంలు వినియోగిస్తుండగా 1,13,325 మంది సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించనున్నట్లు గుజరాత్‌ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

ప్రజలకు అభివాదం చేస్తూ పోలింగ్ కేంద్రానికి వస్తున్న మోదీ

ఏడు స్థానాలకు ఉపఎన్నికలు
గుజరాత్‌ రెండో విడత ఎన్నికలతో పాటు వివిధ కారణాల వల్ల ఖాళీ ఏర్పడిన దేశంలో 7 చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఒక లోక్‌సభతో పాటు 6 శాసనసభ స్థానాలున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌యాదవ్‌ మరణంతో ఖాళీ అయిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో ఉపఎన్నిక జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మెయిన్‌పురి లోక్‌సభ స్థానంతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌సదర్‌, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలు.. ఒడిశాలోని పదంపుర్‌, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌.. బిహార్‌లోని కుర్హానీ.. ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పుర్‌లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో ములాయం ఐదుసార్లు విజయం సాధించారు. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానంలో ములాయం కోడలు, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌ బరిలో నిలిచారు.

ఇవీ చదవండి:ప్రారంభమైన రెండో దశ పోలింగ్​.. ఓటు వేయాలని ప్రధాని విజ్ఞప్తి

సోమవారమే గుజరాత్ రెండో దశ పోలింగ్ తేలనున్న ప్రముఖుల భవితవ్యం

Last Updated : Dec 5, 2022, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details