నూతన సంవత్సరంలో భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితులు మనకు కొత్త పాఠాలు నేర్పించాయని పేర్కొన్నారు.
ఆకాశవాణి ద్వారా 72వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా గొలుసు సరఫరా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆర్థికవేత్తలు కూడా అంచనా వేయలేని పరిస్థితులు వచ్చాయన్నారు. అయితే ఈ కాలంలో భారత్ మరిన్ని సామర్థ్యాలు పెంపొందించుకుందని తెలిపారు. ఈ సామర్థ్యాలనే 'ఆత్మనిర్భర్ భారత్'గా అభివర్ణించారు.
'మార్పు వచ్చింది'
ప్రజలు వోకల్ ఫర్ లోకల్ నినాదం అందిపుచ్చుకున్నారని, ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేసేలా పరిశ్రమలు చర్యలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఉత్తమమైనవి భారత్‌లో తయారుకావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం సంస్థలు, అంకురాలు ముందుకురావాలని అన్నారు.
"దేశ ప్రజల ఆలోచనల్లోనూ ఈ ఏడాది భారీ మార్పులు వచ్చాయి. భారత్‌లో తయారైన ఆటవస్తువులే కావాలని వినియోగదారులు కోరుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ప్రజల దృక్పథంలో మార్పు వచ్చిందనేందుకు ఇది ఉదహరణ. ఈ మార్పు అంత సులభం కాదు."