రాజకీయ అంటరానితనాన్ని భారతీయ జనతా పార్టీ నమ్మదని నొక్కిచెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశాన్ని నడిపించేందుకు ఏకాభిప్రాయానికి విలువ ఇస్తామన్నారు. దేశానికి చేసిన సేవలను గుర్తించే విషయంలో రాజకీయ ప్రత్యర్థులను కూడా పురస్కారాలతో తమ ప్రభుత్వం గౌరవించినట్లు గుర్తు చేశారు.
భారతీయ జన సంఘ్ నాయకుడు, భాజపా సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు మోదీ. ఆయనతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. దయాళ్ జీవితం, ఆయన సంకల్పం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
" భాజపా ఎప్పుడూ రాజకీయంకన్నా జాతీయవాదానికే ప్రాధాన్యం ఇస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తుంది. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీని భారత రత్నతో గౌరవించుకున్నాం. అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయి, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్సీ జమిర్కు పద్మ అవార్డులు ఇచ్చాం. ప్రభుత్వం మెజారిటీతో నడుస్తుంది. కానీ దేశం ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగుతుంది. ఉపాధ్యాయ ఆలోచనలైన అంత్యోదయ, మానవతావాదాలే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పనులకు స్ఫూర్తి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. విదేశీ విధానాల్లో దేశానికే మొదటి ప్రాధాన్యం అనే నియమాన్ని భారత్ పాటిస్తుంది.