దేశం మొత్తం కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోందని మోదీ తెలిపారు. ఈ పోరాటంలో అందరం కలసి కీలక మైలురాళ్లను అందుకున్నామని పేర్కొన్నారు. జూన్ 21న ఒకేరోజు రికార్డు స్థాయిలో టీకాలు పంపిణీ చేసి సరికొత్త మైలురాయిని అధిగమించామన్నారు. అయితే.. మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదని హెచ్చరించారు. పుకార్లను వ్యాప్తిచెందించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. టీకాలపై అపోహలు తొలగితేనే కరోనాపై విజయం సాధిస్తామని తెలిపారు. తనతో పాటు.. సుమారు 100 ఏళ్ల వయసున్న తన తల్లి టీకాలు తీసుకున్నట్లు చెప్పారు.
"కరోనా భయం పోయిందనే భ్రమలో ఉండకండి. సమాజంలో పుకార్లు వ్యాప్తి చేసేవారు చేస్తూనే ఉంటారు. కానీ మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. ఇది ఒక మహమ్మారి. దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సకాలంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలపై మనకు విశ్వాసం ఉండాలి."
-ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దులారియా గ్రామస్థులతో మాట్లాడి టీకాలపై వారికి ఉన్న సందేహాలను తొలగించినట్లు తెలిపారు. అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని సలహా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కరోనా సంక్షోభంలో ఎంతో సంయమనంతో వ్యవహరించారని మోదీ ప్రశంసించారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే క్షేత్రస్థాయి అవసరాలను తీర్చారని కొనియాడారు.
"గ్రామాల్లో సాధారణంగా ఇరుగుపొరుగుకు సహాయం చేసే గుణం ఎక్కువ. కరోనా విజృంభణలోనూ వ్యవసాయ పనులకు అంతరాయం కలగనివ్వలేదు. సమీప గ్రామాల నుంచి పాలు, కూరగాయలు సరఫరా అయ్యేందుకు సహకరించారు. తమ పనితో పాటు ఇతరుల పనిని చేసుకోనిచ్చారు."
-ప్రధాని మోదీ
దిగ్గజానికి నివాళులు..
మిల్కాసింగ్ ప్రస్తావన లేకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుకోలేమని మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే మృతిచెందిన దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్కి నివాళులు అర్పించిన మోదీ.. ఆయనను కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.