Priest Won Gold Medal In Strengthlifting : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ హనుమాన్ ఆలయ పూజారి అరుదైన ఘనత సాధించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకం సాధించారు. 49 ఏళ్ల వయసులోనూ ఆయన పతకాలు సాధించడం వల్ల స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నగరంలోని రోఖాడియా ప్రాంతంలోని ఉన్న హనుమాన్ ఆలయ పూజారి వందన్ వ్యాస్ చాలా ఏళ్లుగా గుడిలో సేవలు చేస్తున్నారు. రోజూ ఆలయంలో పూజలు పూర్తిచేసుకుని నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానికంగా ఓ జిమ్‌లో ప్రదీప్ మోరీ, జితేస్ జవారేల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
ఇటీవలే తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన 10వ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. అందులో మాస్టర్-20(76 కిలోలు) విభాగంలో పూజారి వందన్ వ్యాస్ స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సూరత్ నగరం నుంచి మొత్తం 18 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గోల్డ్ మెడల్ సాధించిన వందన్ వ్యాస్ డాక్టర్లు వద్దని చెప్పినా!
అయితే ఉదయ్పుర్లో కొన్నినెలల క్రితం జరిగిన ఛాంపియన్ షిప్లో వందన్ వ్యాస్ గాయపడ్డారు. దీంతో ఆయనకు మూడు నెలల క్రితం ఆపరేషన్ జరిగింది. అయితే బరువులు ఎత్తవద్దని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ వందన్ వ్యాస్ నిరంతర సాధన చేసి ఈ ఘనత సాధించారు. ఈ పతకాలను హనుమంతుడికి అంకితమిస్తున్నట్లు తెలిపారు.
"నేను రోజూ ఉదయం ఆలయంలో హనుమంతుడిని పూజిస్తాను. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాను. తర్వాత సాయంత్రం జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తాను. డాక్టర్ నన్ను బరువులు ఎత్తవద్దని చెప్పారు. హనుమాన్‌జీ ఆశీస్సులతో నేను బంగారు, కాంస్య పతకాలు సాధించాను. రానున్న రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనబోతున్నాను" అని వందన్ వ్యాస్ తెలిపారు.