బిహార్ దర్భంగాలోని 'శ్యామా దేవాలయం'లోని ఓ అర్చకుని ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర బీహార్‌తో పాటు.. నేపాల్ నుంచి భక్తులు అధికంగా వచ్చే ఈ ఆలయంలో పనిచేస్తున్న ఓ పూజారి మహిళా భక్తురాలిని జుట్టు పట్టుకుని మరీ తీవ్రంగా కొట్టాడు. ఘటన అనంతరం పూజారిని తక్షణమే తొలగించింది ఆలయ కమిటీ. సదరు మహిళకు మతిస్థిమితం సరిగా లేదని గుడి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించిందని.. అందుకే కొట్టాల్సి వచ్చిందని పూజారి వివరణ ఇచ్చాడు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. మహిళా జుట్టు పట్టుకుని పూజారి కొడుతుండటం కనిపించింది. 'ఈ చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని' ఆలయ అధికారి ఒకరు తెలిపారు. 'మహిళ ప్రవర్తనపై ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని' అభిప్రాయపడ్డారు.
"ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. ఆలయం మూసి ఉన్నప్పుడు వచ్చిన ఓ మహిళ గేటును పగలగొట్టేందుకు ప్రయత్నించిందని.. ఈ క్రమంలో అడ్డుకున్నందుకు దాడి చేసిందని అంతర్గత విచారణలో చెప్పాడు. దీంతో ఆమెను అక్కడి నుంచి పంపించేందుకే చేయిచేసుకున్నట్లు తెలిపాడు. ఆలయ సంఘం సమావేశం అనంతరం ఈ వ్యవహారంలో పూజారిపై మరిన్ని చర్యలు తీసుకుంటాం."