మహమ్మారి సమయంలో కీలకంగా మారిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల(oxygen concentrators) ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వినియోగదారులకు మేలు చేకూరిందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ట్రేడ్ మార్జిన్‌పై ప్రభుత్వం పరిమితి విధించడం వల్ల వాటి ధరలు 50శాతానికి పైగా తగ్గాయని, ఆ మేరకు వినియోగదారులకు ఉపశమనం కలిగిందని పేర్కొంది.
ఈ నెల 3 నుంచి జాతీయ ఔషధ ఉత్పత్తుల ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ట్రేడ్ మార్జిన్‌ను డిస్ట్రిబ్యూటర్ ధరలపై 70 శాతానికి పరిమితం చేసింది. దీంతో 104 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీ/దిగుమతి సంస్థలు 252 బ్రాండ్లు/ఉత్పత్తులకు సంబంధించి కొత్త గరిష్ఠ చిల్లర ధరలను సమర్పించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 70 బ్రాండ్ల కాన్సంట్రేటర్లు పాత ధరలతో పోలిస్తే ఒక్కో యూనిట్‌కు రూ.54,337 మేర(54శాతం) తగ్గిందని పేర్కొంది. 58 బ్రాండ్లు 25శాతం వరకు, 11 బ్రాండ్లు 26-50శాతం వరకు ధరలు తగ్గించాయని, 18 దేశీయ బ్రాండ్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది.