పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. తాజాగా అమల్లోకి వచ్చింది. దీంతో పుదుచ్చేరిలో ఏడోసారి రాష్ట్రపతి పాలన విధించినట్లు అయింది.
పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన - President's rule imposed in Puducherry
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలగా.. కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది.
ఈ ఆదేశాలపై సంతకం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. పుదుచ్చేరి పాలన యంత్రాంగం నుంచి వచ్చిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్ బలం తగ్గింది. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించగా నారాయణ స్వామి ప్రభుత్వం అందులో నెగ్గలేకపోయింది. ఓటింగ్‌కు ముందుగానే సీఎం, మంత్రులు రాజీనామా పత్రాలను గవర్నర్‌కు సమర్పించి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్షలో అధికార పార్టీ విఫలమైనట్లు స్పీకర్ శివకొళుందు ప్రకటించారు.