తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత రాష్ట్రపతుల ప్రత్యేకతలేంటో తెలుసా? - రాష్ట్రపతి ఎన్నికలు

భారత 15వ రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ఇంతకుముందు 14మంది దేశానికి ప్రథమ పౌరులుగా సేవలు అందించారు. రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో ఎవరి ప్రత్యేకతలు వారివే అని చెప్పాలి. వారి ప్రత్యేకతలు ఎంటో చూద్దాం.

president of india election results
president of india election results

By

Published : Jul 21, 2022, 10:43 PM IST

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్‌. భారత 15వ రాష్ట్రపతిగా ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మూడో రౌండ్‌ ముగిసేటప్పటికే 50శాతం కన్నా అధిక ఓట్లు సాధించిన ఆమె.. దేశ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళకు చరిత్ర సృష్టించారు. దేశంలో ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన విశిష్ట వ్యక్తుల్లో ఆరుగురు (సర్వేపల్లి రాధాకృష్ణన్‌, బాబూరాజేంద్ర ప్రసాద్‌, జాకీర్‌ హుస్సేన్‌, వీవీ గిరి, అబ్దుల్‌ కలాం, ప్రణబ్‌ ముఖర్జీ) భారతరత్న పొందిన వారు ఉండగా.. న్యాయనిపుణులు, విద్యావేత్తలు, రాజనీతిజ్ఞులూ ఉన్నారు. అయితే వీరిలో ఎవరి ప్రత్యేకతలు వారికే ఉన్నాయి. అవేంటో చూద్దామా?

టీచరు కన్నా తెలివైనవారు.. తొలి రాష్ట్రపతి:బాబూ రాజేంద్రప్రసాద్‌ గొప్ప విద్యావేత్త, న్యాయశాస్త్ర నిపుణులు. ఇంటర్మీడియట్‌ స్థాయి విద్యార్థిగానే ఆయన ప్రతిభ చూసి ముచ్చటపడిన ఓ లెక్చరర్‌ ఏకంగా ఆయన పరీక్ష పత్రాలపైనే 'ఈ పేపరు దిద్దినవారికన్నా పరీక్ష రాసిన విద్యార్థే తెలివైనవాడు' అని రాశారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూ వచ్చిన తొలుత ఆంగ్లం, ఆర్థిక శాస్త్రాల్లో ఉపన్యాసకునిగా చేశారు. తర్వాత న్యాయశాస్త్రం పట్ల ఆకర్షితులయ్యారు. స్వర్ణ పతకంతో ఉత్తీర్ణులై బిహార్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. గాంధీజీ పిలుపుతో అవన్నీ వదిలి దేశసేవకు అంకితమయ్యారు. రాజ్యాంగ సభకి అధ్యక్షుడిగా పనిచేసి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాద్‌, రెండో దఫా కూడా రాష్ట్రపతిగా ఎన్నికై ఆ ప్రత్యేకత సాధించిన ఏకైక రాష్ట్రపతిగా నిలిచారు.

ప్రాక్‌-పశ్చిమాల వారధి:హిందూమతాన్ని భారతీయులూ పశ్చిమ దేశాల్లోనివారూ సరిగ్గా అర్థంచేసుకునేందుకు కృషిచేసిన తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌. అందుకే ఆయనను ప్రాక్‌పశ్చిమాల మధ్య వారధిగా పేర్కొనేవారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన ఉపకారవేతనాలతోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. పాఠ్య పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేక ఎవరో ఇచ్చిన తత్వశాస్త్ర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అందులోనే ఎం.ఏ. పూర్తిచేశారు. 20 ఏళ్లకే వేదాంతాల గురించి అద్భుతమైన సిద్ధాంత గ్రంథం ప్రచురించి గురువులనే అబ్బురపరిచారు. యునెస్కోకి భారత ప్రతినిధిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా, ఉపరాష్ట్రపతిగా సేవలందించి, రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

తొలి ముస్లిం:దేశానికి మూడో రాష్ట్రపతిగా చేసిన జాకీర్‌ హుస్సేన్‌ ఆ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం. ఆధునిక విద్యావేత్త, మేధావి. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆయన ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. దిల్లీలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా సహవ్యవస్థాపకుడాయన. రెండు దశాబ్దాలపాటు ఆ సంస్థ సారథిగా ఉండి ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, బిహార్‌ గవర్నర్‌గా, ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. రాష్ట్రపతిగా రెండేళ్లు మాత్రమే పదవిలో ఉన్నారు. పదవిలో ఉండి కన్నుమూసిన తొలి రాష్ట్రపతి.

అంతరాత్మప్రబోధం.. అప్పుడే!:స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైక వ్యక్తి వరాహగిరి వెంకటగిరి. ఐర్లాండ్‌లో లా చదివిన గిరి విద్యార్థి దశ నుంచీ ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవారు. భారత్‌ వచ్చి మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నెమ్మదిగా వృత్తిని వదిలి ఉద్యమాలే వూపిరిగా ముందుకు సాగారు. కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి పలుమార్లు జైలుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చాక కేంద్ర మంత్రిగా, యూపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా చేశారు. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున నీలం సంజీవరెడ్డి, ప్రతిపక్షాల అభ్యర్థిగా సి.డి.దేశ్‌ముఖ్‌ పోటీ చేయగా గిరి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అభ్యర్థిగా నీలంను ఎంపిక చేయడం ఇష్టంలేని ఇందిరాగాంధీ అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయమని సభ్యులకు సూచించింది ఈ ఎన్నికలోనే. విజయం గిరినే వరించినా ఆయన ఎన్నికపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. సంప్రదాయానికి విరుద్ధంగా కాబోయే రాష్ట్రపతి అయి వుండీ గిరి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు కేసును కొట్టివేయడం వల్ల ఆయన భారత నాలుగో రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి పదవి ప్రధానికి పూర్తి మద్దతునిచ్చే పదవిగా మారింది గిరి హయాం నుంచే.

అత్యయిక పరిస్థితి తెచ్చిన అహ్మద్‌:ఐదో రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ అస్సామీ ముస్లిం అయిన దిల్లీ వాసి. న్యాయవాది. కాంగ్రెస్‌ వ్యక్తి. స్వాతంత్య్ర సమరయోధుడు. రాజ్యసభకూ అసోం శాసనసభకూ ఆ తర్వాత లోక్‌సభకూ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా చేశారు. దేశంలో ఆత్యయిక పరిస్థితిని విధించే ఆదేశాల మీద అర్ధరాత్రి సంతకం చేసిన రాష్ట్రపతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పదవిలో ఉండగా కన్నుమూసిన రెండో రాష్ట్రపతి అహ్మద్‌.

తెలుగువాడు.. ఏకగ్రీవమ్యారు..:సుదీర్ఘ రాజకీయ చరిత్ర నీలం సంజీవరెడ్డి సొంతం. చదువు మధ్యలో వదిలేసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకరుగా వివిధ పదవులు నిర్వహించారాయన. ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఆకస్మిక మృతితో రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరపాల్సి వచ్చింది. నిజానికి ఆ సమయంలో 37 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 36మంది నామినేషన్‌ పత్రాలను ఎన్నికల సంఘం తిరస్కరించడం వల్ల నీలం ఒక్కరే బరిలో మిగిలారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి అభ్యర్థి అయ్యారు. 67 ఏళ్ల వయసులో అత్యంత పిన్నవయస్కుడైన రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతి పదవికోసం రెండుసార్లు తీవ్రంగా పోటీ పడిన తొలి అభ్యర్థి కూడా ఆయనే. ఇందిరాగాంధీ హయాంలో పోటీ చేసి ఓడిపోయాక ఆరేళ్లు సొంతూళ్లొ వ్యవసాయం చేసుకున్నారు. తిరిగి జయప్రకాశ్‌ నారాయణ పిలుపుతో జనతా పార్టీలో చేరారు. 'వితౌట్‌ ఫియర్‌ ఆర్‌ ఫేవర్‌: రెమినిసెన్సెస్‌ అండ్‌ రిఫ్లెక్షన్స్‌ ఆఫ్‌ ఎ ప్రెసిడెంట్‌' పేరుతో తన అనుభవాలను పుస్తకంగా రాశారు.

ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ఆయనకు తెలియదు!:ఏడో రాష్ట్రపతి జైల్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నేత. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి సహా పలు పదవులు నిర్వహించారు. ఇందిరకు విశ్వాసపాత్రుడైన ఆయన రాష్ట్రపతిగా నియమితులవగానే 'మా నేత చీపురు పట్టుకుని వూడవమన్నా వూడుస్తాను..' అని వ్యాఖ్యానించి విమర్శలపాలయ్యారు. అంత విశ్వాసపాత్రుడైనా ఆపరేషన్‌ బ్లూస్టార్‌ గురించి ఆయనకు మాటమాత్రంగానైనా చెప్పలేదు ఇందిర. ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఇందిర హత్య, అనంతర అల్లర్లు.. రాష్ట్రపతిగా జైల్‌సింగ్‌ ఉన్నప్పుడు జరిగిన కీలక సంఘటనలు.

సంకీర్ణ రాజకీయాలకు ఆరంభం:దేశ ఎనిమిదో రాష్ట్రపతిగా చేసిన ఆర్‌. వెంకట్రామన్‌ న్యాయవాది, రాజకీయవేత్త. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నారు. రాజ్యాంగ సభ సభ్యుడిగా చేశారు. నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికై ఆర్థిక, రక్షణ మంత్రిగా సేవలందించారు. పలుమార్లు దేశ ప్రతినిధిగా ఐరాస సభలకు వెళ్లారు. రాష్ట్రపతిగా ఆయన నలుగురు ప్రధానులతో కలిసి పనిచేశారు. దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది ఆ సమయంలోనే. పలు పుస్తకాలు రాశారాయన.

విద్యార్థులకు శర్మ స్వర్ణపతకం:శంకర్‌ దయాళ్‌ శర్మ కూడా రాష్ట్రపతి హోదాలో నలుగురు ప్రధానులను చూశారు. ఈ న్యాయశాస్త్ర నిపుణుడు కేంబ్రిడ్జిలో లా ఉపన్యాసకుడిగా పనిచేశారు. 1940వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌లో చేరి చివరివరకూ కాంగ్రెస్‌ వ్యక్తిగానే ఉన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. రాష్ట్రపతిగా రెండోసారి పోటీ చేయడానికి నిరాకరించిన ఆయన తన పేరున ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వర్ణపతకం ఇచ్చే ఏర్పాటుచేశారు. 1994 నుంచీ పలు విశ్వవిద్యాలయాల్లో ఉత్తమ విద్యార్థులకు ఈ స్వర్ణపతకం ఇస్తున్నారు.

దౌత్యవేత్తగా మొదలై..:దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నత విద్యావంతుడు, తొలి దళితుడు భారత పదో రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌. ఉత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ ప్రశంసలందుకున్న ఆయన ఇందిర సూచనపై రాజకీయాల్లో ప్రవేశించారు. తనని తాను 'వర్కింగ్‌ ప్రెసిడెంట్‌'గా పేర్కొన్న నారాయణన్‌ పలు మంచి సంప్రదాయాలకు తెరతీశారు. పదవిలో ఉండగా ఓటు వేసిన తొలి రాష్ట్రపతి ఆయనే.

ప్రజా రాష్ట్రపతి కలాం:శాస్త్రవేత్తగా నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన అబ్దుల్‌ కలాం 'మిస్సైల్‌ మ్యాన్‌'గా నేటి తరానికి సుపరిచితులు. రాష్ట్రపతి భవనంలో సైతం ఆయన గడిపిన నిరాడంబర జీవితం గురించి తెలియనివారూ స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు విననివారూ ఉండరు. ప్రజా రాష్ట్రపతిగా ఆయన పేరొందారు.

తొలి మహిళ:కలాం తర్వాత రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్‌ వృత్తిరీత్యా న్యాయవాది. రాష్ట్రపతి పదవి అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిచారు. 27వ ఏట నుంచే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న ఆమెను అనూహ్యంగా రాష్ట్రపతి పదవి వరించింది.

టీచరు.. ఆర్థికమంత్రి.. రాష్ట్రపతి:భారత 13వ రాష్ట్రపతిగా పనిచేసిన దివంగత నేత ప్రణబ్‌ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ కొంతకాలం పాత్రికేయుడిగానూ పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రణబ్‌ 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆర్థిక సంస్కరణలకు ముందూ, తర్వాతా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా, కీలకమైన నాలుగు శాఖలకు (రక్షణ, ఆర్థిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాలు) కేంద్ర మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆర్థిక మంత్రిగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనతా ఆయనదే. రాష్ట్రపతి హోదాలో ఉండి గత ఏడాది ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు భారత రాజకీయ చరిత్ర బోధించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. గత 40 ఏళ్లుగా డైరీ రాసిన ఆయన తన తన మరణానంతరమే దాన్ని పుస్తకంగా ప్రచురించాలని కుటుంబసభ్యులకు సూచించారు.

రాజకీయ, న్యాయ'కోవిదు'డు!:మరికొద్ది రోజుల్లో పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చిన్నతనంలో ఐఏఎస్‌ అధికారి కావాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. దిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా పనిచేశారు. 1980 నుంచి 1993 వరకు సుప్రీంకోర్టులో స్టాండింగ్‌ కౌన్సెల్‌గా ఉన్నారు. కొంతకాలం ఆయన మొరార్జీ దేశాయ్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. భాజపాలో చేరాక యూపీలో కల్యాణ్‌సింగ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రభుత్వాలకు అనధికార న్యాయసలహాదారుగానూ వ్యవహరించారు. స్వతహాగా అంతర్ముఖుడైన కోవింద్‌ చట్టపరంగా, వ్యవస్థాపరంగా పార్టీకి అండగా నిలవడానికే ఇష్టపడ్డారనీ.. అదే ఆయన రాష్ట్రపతి పదవికి ఎంపిక అవ్వడానికి దోహదం చేసిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. 1994 నుంచి 2006 వరకూ రెండు దఫాలు యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు కోవింద్.‌. గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికీ మౌలిక సదుపాయాలకల్పనపైనా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రామ్‌నాథ్‌ ప్రసంగించారు. 2015లో బిహార్‌ గవర్నర్‌గా నియమితులైన ఆయన్ను 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా బరిలో దించింది.

తొలి గిరిజన మహిళ.. రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు!: దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ ఆసీనులుకాబోతున్నారు. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైదపోసిలో 1958 జూన్‌ 20న జన్మించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా (1973-1983 మధ్యకాలంలో).. రాయ్‌రంగపూర్‌లో శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ఉపాధ్యాయురాలిగా (1994-1997) పనిచేశారు. భారత రాష్ట్రపతులందరిలో అతి పిన్న వయస్కురాలు (64 ఏళ్లు) ఈమే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు నీలం సంజీవ రెడ్డి (67 ఏళ్లు) పేరిట ఉండగా.. తాజాగా 64 ఏళ్ల ముర్ము దక్కించుకున్నారు. 1997లో భాజపాలో చేరిన ఆమె రాయ్‌రంగపుర్‌ కౌన్సిలర్‌గా, వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ముర్ము.. 2000-2002 మధ్య ఒడిశా రవాణా, వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. 2002 నుంచి 2015 వరకు మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, పనిచేసిన ఆమె 2015లో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెను ఎన్డీయే బరిలో దించడంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ విజయం సాధించారు.

ఇవీ చదవండి:ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ.. ఇంటికి వెళ్లి అభినందించిన ప్రధాని మోదీ

అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details