Farooq Abdullah President polls: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న వేళ.. వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉండేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నిరాకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను మమత ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనల నుంచి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు ఫరూఖ్ శనివారం తెలిపారు.
Presidential elections 2022: "రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ నా పేరును ప్రతిపాదించడం ఆనందంగా ఉంది. ఆ తర్వాత చాలా మంది విపక్ష నేతలు నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అది నా మనసును ఎంతగానో హత్తుకుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ అనూహ్య ప్రతిపాదనపై నేను మా పార్టీ సీనియర్ నేతలు, కుటుంబసభ్యులతో చర్చించాను. అయితే ప్రస్తుతం జమ్ము కశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి జమ్ము కశ్మీర్‌ను బయటపడేసేందుకు నా వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. క్రియాశీల రాజకీయాల్లో ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నా. జమ్మూకశ్మీర్‌తో పాటు ఈ దేశ సేవలో సానుకూల సహకారం అందించేందుకు ఎదురుచూస్తున్నా. అందువల్ల రాష్ట్రపతి రేసు నుంచి నా పేరును ఉపసంహరించుకుంటున్నా. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి నా మద్దతు ఉంటుంది" అని ఫరూఖ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.