Presidential Elections 2022: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఇప్పటికైతే తమ అభ్యర్థిని రాష్ట్రపతి భవన్‌కు పంపించడానికి అధికార భాజపాకు ఎలాంటి ఇబ్బందీ లేనప్పటికీ.. త్వరలో వెలువడబోయే యూపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు, ఒడిశాలో అధికారంలో ఉన్న తెరాస, వైకాపా, బిజూ జనతా దళ్ (బిజద) రాష్ట్రపతి ఎన్నికలో కీలకం కానున్నాయి. ఈ మూడు పార్టీలు ప్రస్తుతం ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉన్నాయి. ఒకవేళ యూపీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైతే భాజపాకు ఈ మూడు పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.
యూపీనే ఎందుకు కీలకం..?
UP Elections 2022: అతిపెద్ద రాష్ట్రమైన యూపీ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కీలక భూమిక పోషించబోతోంది. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. మొత్తం యూపీ అసెంబ్లీలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ లెక్కన వీరి మొత్తం ఓటు విలువ 83,824 కానుంది. ఇక మిగిలిన ఎన్నికల రాష్ట్రాలను తీసుకుంటే పంజాబ్‌లో 117 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 116 చొప్పున 13,572; ఉత్తరాఖండ్ 70 మంది ఎమ్మెల్యేల విలువ 64 చొప్పున 4480; గోవాలోని 40 మంది ఓటు విలువ 20 చొప్పున 800; మణిపూర్‌లోని 60 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 18 చొప్పున 1080గా ఉంది. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ దేశంలోనే అత్యధికం. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కేవలం ఏడు మాత్రమే!
ఆ పార్టీల మద్దతు తప్పనిసరి..
presidential elections 2022 candidates: రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అకాలీదళ్, శివసేన వంటి మిత్రులు దూరమయ్యారు. కూటమిలో లేనప్పటికీ సన్నిహితంగా మెలిగిన కొన్ని పార్టీలు సైతం భాజపాను దూరం పెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఎన్డీయే తన అభ్యర్థిని రాష్ట్రపతిగా నెగ్గించుకోవాలంటే మిత్ర పక్షాలతో పాటు సన్నిహితంగా మెలిగే పార్టీలను కలుపుకోవడం ముఖ్యం. గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను నిలబెట్టినప్పుడు తెరాస మద్దతు పలికింది. ఇప్పుడు అదే పార్టీ భాజపాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకభూమిక పోషించేందుకు ఆ పార్టీ అధినేత విపక్షాల మద్దతు కూడగట్టడంలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే విపక్ష పార్టీ నేతలను కలుస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం సైతం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చీలిక తెచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో రేపటి యూపీ ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో భాజపా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.