తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పవార్​ చుట్టూ రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం- మమత భేటీపైనే అందరి దృష్టి

రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. బుధవారం బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు నిర్ణయించాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పవార్​ మాత్రం ఒప్పుకోవట్లేదు. మమత ఆధ్వరంలో జరిగే భాజపాయేతర పార్టీల సమావేశంలో ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు పవార్​ను ఒప్పిస్తారా? కొత్త పేరును తెరపైకి తేస్తారా?

didi
మమతా బెనర్జీ

By

Published : Jun 14, 2022, 7:34 PM IST

రాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ హీట్​ను పెంచేశాయి. భాజపాను ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న విపక్షాలు.. మంగళవారం స్వరాన్ని కాస్త మారినట్లు కనిపిస్తోంది. బుధవారం బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి కాంగ్రెస్​ మిత్రపక్షాలు సహా ఇతర విపక్షాలు కూడా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

లేఖపై గుస్సా..
రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి కోసం.. భాజపాయేతర పార్టీలతో వేదికను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా ప్రతిపక్షాలకు లేఖ రాశారు. అది జరిగిన కొద్ది సేపటికే బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సైతం.. ఈ నెల 15న నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని విపక్ష నేతలకు లేఖ రాసింది. దీంతో లెఫ్ట్​ పార్టీలతో పాటు కాంగ్రెస్​ మిత్ర పక్షాలు తృణమూల్​ అధినేత్రి చర్యను తప్పు పట్టారు. ఏకపక్ష నిర్ణయం అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ వ్యవహారం.. భాజపాకు లాభం కలిగించే విధంగా ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మమత సమావేశానికి హాజరు కాబోము అంటూ తేల్చి చెప్పారు.

అయితే మంగళవారం విపక్షాలు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాల్లో చీలిక వస్తే.. అధికార పార్టీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతో.. ఆయా పార్టీలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అందుకే మమత సమావేశానికి ప్రతినిధులను పంపాలని భావిస్తున్నాయి కాంగ్రెస్​తో పాటు ఇతర పార్టీలు. అయితే అగ్రనేతలు కాకుండా.. ఎంపీ స్థాయిలో ఉన్న నేతలను పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

కాంగ్రెస్​ నుంచి కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్​ రమేశ్​, రణ్​దీప్​ సుర్జేవాలా.. మమతా బెనర్జీ నిర్వహించే సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్పారు. సీపీఎం, సీపీఐ నుంచి కూడా.. పార్టీ అగ్ర నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా కాకుండా ఎంపీలు వెళ్లనున్నారు. సీపీఎం నుంచి రాజ్యసభలో పార్టీ నాయకుడిగా ఉన్న కరీం హాజరయ్యే అవకాశం ఉంది.

అదే విధంగా మమత లేఖకు సీపీఎం అగ్రనేత ఏచూరి ప్రత్యుత్తరం కూడా రాశారు. మమత ఏకపక్ష నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మందస్తు సమాచారం, సంప్రదింపులు ఉంటే బాగుంటుందని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.

పవార్​తో మమత సమావేశం:ఈ సమావేశం కోసం.. ఇప్పటికే మమతా బెనర్జీ దిల్లీకి చేరుకోగా.. ఎన్సీపీ అధినేత కూడా హస్తినకు వచ్చారు. విపక్షాలన్నీ రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్​ పవార్​ ఉండాలని కోరుకుంటున్నాయి. అయితే పవార్​ ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఎన్సీపీ సమావేశంలో తాను రాష్ట్రపతి రేసులో లేనని స్పష్టం చేశారు ఆయన. ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ.. దిల్లీ చేరుకున్న తర్వాత నేరుగా పవార్​ ఇంటికి వెళ్లి చర్చించారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు ఒప్పించేందుకు దీదీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

అయితే దీదీ కలవడానికి ముందు.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జనరల్‌ సెక్రటరీ రాజా కూడా శరద్‌ పవార్‌ను కలిశారు. వారు పవార్​ను ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఏచూరి, రాజా ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు పవార్‌ నిరాకరించినట్లు, ఇతర నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:ఉద్యోగాలే ఉద్యోగాలు.. కేంద్ర శాఖల్లో 10లక్షలు.. ఆర్మీలో 45వేలు

ABOUT THE AUTHOR

...view details