Congress vs TMC: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యతకు బదులు.. వాటి మధ్య చీలికలు బయటపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య! ఈ రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌కు తృణమూల్ దూరంగా ఉండటం.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలకు ఎంతమాత్రమూ శుభసూచకం కాదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడం వెనక ఘనత తమదేనని చాటుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు తృణమూల్ గట్టిగానే ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం వాటి మధ్య అభిప్రాయ భేదాలను స్పష్టంగా బయటపెట్టింది.
కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆళ్వా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవగా.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్ ప్రకటించింది. ఇద్దరు తిరుగుబాటు నేతలు మినహా ఆ పార్టీకి చెందిన ఎంపీలెవరూ ఓటు వేయలేదు కూడా. ఈ వ్యవహారంలో తృణమూల్ తీరుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆళ్వా కూడా ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ విమర్శలకు తృణమూల్ నేతలు పలుమార్లు దీటుగా స్పందించారు. ''కాంగ్రెస్ మాకు మిత్రపక్షమేమీ కాదు. భావసారూప్యమున్న పార్టీ మాత్రమే'' అని ఆ పార్టీ నేత సాకేత్ గోఖలే ఓ దశలో వ్యాఖ్యానించారు.