Ramnath kovind farewell: జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విభజన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి ప్రజా సంక్షేమానికి ఏది ముఖ్యమో నిర్ణయించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజకీయ పార్టీలకు హితవుపలికారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణిస్తూ హక్కుల సాధన కోసం ప్రజలు, పార్టీలు గాంధేయ మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎంపీలు పార్లమెంటులో చర్చించేటప్పుడు మహాత్ముని అడుగు జాడల్లో నడవాలని సూచించారు. ఆదివారం పదవీ విరమణ చేయబోతున్న రాష్ట్రపతి కోవింద్ గౌరవార్థం పార్లమెంటు సభ్యుల తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా శనివారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లాలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి పార్లమెంటును నడిపిస్తున్న ఉభయ సభాపతులను అభినందించారు.
భిన్నాభిప్రాయాలు సహజం
‘‘కుటుంబంలో మాదిరిగానే పార్లమెంటులోనూ అప్పుడప్పుడు విభిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. భవిష్యత్తు మార్గం ఎలా ఉండాలన్నదానిపై పార్టీలు విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. మనమంతా పార్లమెంటు కుటుంబ సభ్యులం. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరం పనిచేయాలి. దేశాన్ని విశాల ఉమ్మడి కుటుంబంగా చూస్తే అభిప్రాయ భేదాలను పరిష్కరించడానికి అనేక మార్గాలు కనిపిస్తాయి. లక్ష్యాలను సాధించుకోవడానికి మహాత్మాగాంధీ శాంతి, అహింస పద్ధతిలో సత్యాగ్రహ అస్త్రాన్ని ప్రయోగించారు. ఎదుటి పక్షాన్ని కూడా గౌరవించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇప్పటివరకూ ఎంతో చేశాం. చేయాల్సింది చాలా ఉంది. ఈ రోజు సామాన్యులు కూడా విమానాల్లో తిరగగలుగుతున్నారు. భేదభావాల్లేని పరిపాలన ద్వారానే అది సాధ్యమైంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ బాలుర కంటే బాలికలు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం ఈ మార్పును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాను’’ అని కోవింద్ పేర్కొన్నారు.