Padma Bhushan To Krishna and Suchitra Ella: దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పలువురు విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల మార్చి 21న తొలి విడతగా కొందరికి అందజేయగా.. సోమవారం భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ మూర్తి ఎల్ల, ఆయన భార్య సుచిత్ర కృష్ణ ఎల్ల సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సహా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. ఈ సంవత్సరం మొత్తం 128 మందిని పద్మ పురస్కారాల కోసం ఎంపిక చేసింది కేంద్రం.
ప్రభ ఆత్రే, కల్యాణ్ సింగ్‌కు పద్మవిభూషణ్: హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందిన గాయని ప్రభ ఆత్రేకు(విభాగం- కళలు) భారత రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ అందజేశారు రాష్ట్రపతి. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు రాజ్వీర్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికిగానూ మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం.. 17 మందిని పద్మభూషణ్, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తొలి విడత అవార్డుల ప్రదానం మార్చి 21న జరిగింది.
కరోనా టీకా ఆవిష్కరణకే: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో.. వ్యాక్సిన్‌ను ఆవిష్కరించినందుకుగానూ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లను భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఈ ఇద్దరూ.. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశీయంగానే అత్యంత వేగంగా వ్యాక్సిన్ రూపకల్పనకు కృషిచేశారు. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి పాతికేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా కృష్ణ స్థాపించిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన 'కొవాగ్జిన్' టీకా .. ప్రపంచ ఆరోగ్య సంస్థతో (డబ్ల్యూహెచ్‌ఓ) పాటు ఎన్నో దేశాల్లో గుర్తింపు సంపాదించింది. మన దేశం నుంచి వచ్చిన పూర్తి స్వదేశీ టీకా కూడా ఇదే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు టీకా ఆవిష్కరించిన కొద్ది కంపెనీల్లో భారత్ బయోటెక్ ఒకటి కావటం మన దేశానికెంతో గర్వకారణం.
డాక్టర్ కృష్ణ ఎల్ల: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్‌కాన్సిన్- మ్యాడిసన్ నుంచి మాలిక్యులార్ బయాలజీలో పీహెచ్‌డీ చేశారు. తర్వాత సౌత్ కరోలినా మెడికల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మానవాళి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు టీకాలు అభివృద్ధి చేయడమే పరిష్కారమనేది ఆయన గట్టి నమ్మకం. తనకు ఉన్న అర్హతలు, విజ్ఞానం, అనుభవంతో ఆయన అమెరికాలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కానీ స్వదేశం మీద మక్కువతో కుటుంబంతో సహా వెనక్కి తిరిగి వచ్చారు. భార్య సుచిత్ర ఎల్లతో కలిసి 1996లో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్‌ను స్థాపించారు. హెపటైటిస్-బి టీకాతో మొదలు పెట్టి ఎన్నో వ్యాధులకు టీకాలు ఆవిష్కరించారు. అన్నింటికీ మించి కరోనా మహమ్మారికి ‘కొవాగ్జిన్’ టీకా రూపొందించే క్రమంలో ఆయన చూపిన చొరవ, ప్రభుత్వంతో కలిసి పనిచేసిన తీరు, ముఖ్యంగా ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగిన విధానం.. టీకాను వేగంగా ఆవిష్కరించేందుకు దోహదపడ్డాయి. పశువుల టీకాలు ఉత్పత్తి చేసే సంస్థను కూడా కృష్ణ ఎల్ల స్థాపించారు. ఆహార ప్రాసెసింగ్ విభాగంలోకీ అడుగుపెట్టారు. ఇలా పలురకాల వ్యాపార కార్యకలాపాల్లో ఎంత తీరికలేకుండా ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన శాస్త్ర పరిశోధన, పరిశోధన సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొనడం, అనుభవాలను- ఆలోచనలను పంచుకోవడం మాత్రం మానలేదు. శాస్త్ర విజ్ఞానంలో మనదేశానికి తిరుగులేదని నిరూపించాలనే కలను సాకారం చేసేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.