పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైందని తెలిపారు. తుపాన్ల నుంచి బర్డ్‌ఫ్లూ వరకు ఎన్నో సవాళ్లను దేశం ఎదుర్కొందన్నారు. దేశ రైతుల ప్రయోజనం కోసమే 3 సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం మద్దతు ధరలు పెంచుతోందని చెప్పారు.
ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంది. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదని ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చాం. భారత్ అభివృద్ధి ప్రస్థానాన్ని ఏ సవాల్ కూడా అడ్డుకోలేదు. రైతుల సంక్షేమం కోసమే నూతన సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13 వేల కోట్లు బదిలీ చేశాం. నూతన సాగు చట్టాలు రైతుల హక్కులకు భంగం కలిగించవు. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయి. విస్తృత చర్చల తర్వాతే సాగు చట్టాలను పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి.