తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ మా సేవల్ని గుర్తించారు'.. ఇళయరాజా, పీటీ ఉష హర్షం - ఇళయరాజా రాజ్యసభ

Rajya Sabha nomination Ilaiyaraaja: రాజ్యసభకు తమను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఇళయరాజా, పీటీ ఉష. ఈ అవకాశాన్ని తమకు దక్కిన గౌరవంగా భావిస్తామని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని తాను ఊహించలేదని వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. మరోవైపు, వీరికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

president quota Rajya Sabha nominations
president quota Rajya Sabha nominations

By

Published : Jul 7, 2022, 2:20 PM IST

Ilaiyaraaja RS nomination: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపిక కావడం పట్ల సంగీత విధ్వాంసుడు ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. సంగీత సౌష్ఠవాన్ని సమాజానికి చేరవేయడానికి తనకు దక్కిన అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సీటు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. "భారత ప్రభుత్వం ఇచ్చిన ఈ గౌరవంతో.. సంగీతాన్ని వృత్తిగా, ప్యాషన్​గా భావించవచ్చనే భావన యువతలో పెరుగుతుంది. సంగీతం, కళల విషయంలో భారత్​కు ఘనమైన వారసత్వం ఉంది" అని ఇళయరాజా పేర్కొన్నారు.

PT Usha Rajya Sabha: పెద్దల సభకు నామినేట్ అయిన పీటీ ఉష సైతం.. తనకు దక్కిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు గర్వించదగిన క్షణాలని పేర్కొన్నారు. దేశ క్రీడా రంగానికి, ముఖ్యంగా అథ్లెటిక్స్​కు దక్కిన గౌరవం ఇది అని చెప్పారు. 'క్రీడాకారులతో ప్రధాని సన్నిహితంగా ఉంటారు. ఏదైనా ఈవెంట్​కు వెళ్లేముందు శుభాకాంక్షలు చెబుతారు. పోటీలు పూర్తయ్యాకా స్పందిస్తారు. ఇది మా అందరికీ స్ఫూర్తినిస్తుంది' అని ఉష పేర్కొన్నారు.

ఈ గౌరవాన్ని తాను ఊహించలేదని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వీరేంద్ర హెగ్గడే అన్నారు. తమ నుంచి ఎలాంటి ప్రయత్నాలు లేకున్నా.. దేశ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న వ్యక్తులను ప్రధాని మోదీ గుర్తించారని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా దేశానికి సేవచేయడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పారు. "ఇన్ని ఒత్తిళ్లలోనూ రోజూ నాకు కొంత సమయం మిగులుతుంది. దీన్ని మరింత సమర్థంగా ఉపయోగిస్తా. ఈ పదవి గురించి మరింత తెలుసుకుంటా. నా వంతు ప్రతిపాదనలు చేస్తా" అని వివరించారు.

వెంకయ్య అభినందన
రాష్ట్రపతి కోటాలో మొత్తం నలుగురిని రాజ్యసభకు పంపాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. ఇళయరాజా, పీటీ ఉష, సినీ రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ వీరేంద్ర హెగ్గడేను పెద్దల సభకు నామినేట్ చేసింది. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నామినేటెడ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంబంధిత రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఈ నలుగురు రాజ్యసభకు రావడం వల్ల.. సభాగౌరవం పెరుగుతుందని అన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details