ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ దేహత్లోని స్వగ్రామం పరౌఖ్ చేరిన వేళ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం పరౌఖ్లో అడుగుపెట్టగానే.. వంగి నేలను తాకి గౌరవ వందనం చేశారు. పర్యటన సందర్భంగా డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రాహానికి నివాళి అర్పించిన ఆయన.. ఆ తర్వాత మిలాన్ కేంద్రాన్ని సందర్శించారు.
అనంతరం గ్రామంలోని వీరనారి ఝల్కరీ బాయి ఇంటర్ కళాశాలలో ప్రజా ఆత్మీయ సమ్మేళనంలో కోవింద్ మాట్లాడారు. తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు.
"గ్రామాల నుంచి వచ్చిన నా లాంటి సాధారణ బాలుడు దేశంలోనే అత్యున్నత పదవి చేపడతాడని కలలో కూడా ఊహించలేదు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ దానిని చేసి చూపెట్టింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. ఈ నేల, మీ ప్రేమ, ఆదరాభిమానాలే. ఈ ఊరి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నా మదిలోనే ఉంటాయి. పరౌఖ్ అంటే కేవలం ఓ ఊరు కాదు.. నా మాతృభూమి. అదే నాకు దేశానికి సేవ చేయాలనే ప్రేరణ కలిగించింది."
- రామ్నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి