President Elections 2022 Lalu Prasad Yadav: మరికొద్ది రోజుల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపైనే దేశమంతా చర్చ జరుగుతోంది. రామ్‌నాథ్ కోవింద్ తర్వాత తదుపరి రాష్ట్రపతి ఎవరనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఇంతకీ రాష్ట్రపతి బరిలో నిలిచేదెవరెవరు? గెలిచేదెవరు? ఈ ప్రశ్నలే ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. ఆగండాగండీ.. ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. మీరనుకుంటున్నట్లుగా రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కాదు ఈయన. ఆయన పేరే కలిగిన మరో వ్యక్తి.
ఎవరీ లాలూ?
లాలూ ప్రసాద్ యాదవ్(42) బిహార్‌లోని సరన్ జిల్లాలో మర్‌హౌరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రహిమ్‌పుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. వ్యవసాయం చేస్తూనే సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. ఆయనకు ఏడుగురు పిల్లలు కాగా.. పెద్ద కూతురికి ఇటీవలే పెళ్లి చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పేరే కలిగి ఉండి గతంలో పలుసార్లు ఎన్నికల్లో పోటీ చేయడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు.
తాజాగా ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికోసం జూన్ 15న నామినేషన్ దాఖలు చేయడానికి ఇప్పటికే దిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు 2017లో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తాను నామినేషన్ దాఖలు చేశానని.. అయితే, తనని ప్రతిపాదించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో నామినేషన్ తిరస్కరణకు గురైందని తెలిపారు. కానీ, ఈసారి మాత్రం తాను పకడ్బందీగా సిద్ధమయ్యానని పేర్కొన్నారు.