President Elections 2022: రాజ్యసభ ఎన్నికల్లో భాజపా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను రాబట్టింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో తాము అనుకున్నదానికంటే ఒక్కో అభ్యర్థిని అదనంగా గెలిపించుకోవడంతోపాటు, హరియాణాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం కమలనాథులకు హుషారునిచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు లేదా వారికి అనుకూలంగా ఉన్న స్వతంత్ర సభ్యులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడేలా భాజపా వ్యూహం రచించి, విజయవంతంగా అమలుచేసింది.
ఈ దఫా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లోని 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో 16 సీట్లకు ఎన్నిక జరిగింది. వచ్చేనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో తాజా ఫలితాలు అధికార కూటమికి శక్తినిచ్చాయి. 10.86 లక్షల ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో భాజపా కూటమికి 48%కిపైగా ఓట్లు ఉన్నాయి. వైకాపా, బీజేడీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో సులభంగా నెగ్గుతామన్న ధీమా కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.
భాజపాకు 92... కాంగ్రెస్‌కు 31
- రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగియడం వల్ల సభలో ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ బలాబలాల్లో కాస్త మార్పులొచ్చాయి. భాజపాకు ఇదివరకు 95 స్థానాలుండగా ఇప్పుడు అది 92కి తగ్గింది. కాంగ్రెస్ బలం 29 నుంచి 31కి పెరిగింది.
- ఇటీవల ఎన్నిక జరిగిన 57 స్థానాల్లో భాజపా 22, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకున్నాయి. ఇదే సమయంలో భాజపా నుంచి 25 మంది, కాంగ్రెస్ నుంచి ఏడుగురు పదవీ విరమణ చేస్తున్నారు. భాజపా బలం 3 స్థానాల మేర తగ్గగా కాంగ్రెస్‌కు 2 సీట్లు పెరిగినట్లయింది.
- రాజస్థాన్‌లో భాజపా మద్దతుతో స్వతంత్రంగా పోటీచేసిన సుభాష్ చంద్ర ఓటమి చవిచూశారు. అయితే ఆయన పదవీ కాలం ఆగస్టు 1తో ముగియనున్నందున రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటేసే అవకాశం ఉంటుంది.
- తాజా ఎన్నికలతో ఎగువసభలో వైకాపా 6 నుంచి 9కి, ఆప్ మూడు నుంచి 10కి సంఖ్యాబలాన్ని పెంచుకున్నాయి. డీఎంకే, బీజేడీ, తెరాస, జేడీయూ, ఎన్‌సీపీ, శివసేన బలాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
- ప్రస్తుతం ఎగువసభలో భాజపా, కాంగ్రెస్ తరువాత 13 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాతి స్థానాలను డీఎంకే, ఆప్‌లు (చెరి 10మంది సభ్యులు) పంచుకోనున్నాయి. ఆ తర్వాతి స్థానంలో బీజేడీ, వైకాపా (9మంది చొప్పున) నిలువనున్నాయి.
- అన్నాడీఎంకే సంఖ్యా బలం 5 నుంచి 4కి తగ్గనుంది. సమాజ్‌వాదీ పార్టీ బలం 5 నుంచి 3కి తగ్గనుంది. ఆర్‌జేడీ బలం 5 నుంచి ఆరుకు పెరగనుంది. బీఎస్సీ బలం 3 నుంచి ఒకటికి పడిపోనుంది.
ఇవీ చదవండి:'ఇంకెంత కాలం 'మాజీ'గా ఉంచుతారు?'.. కాంగ్రెస్ కీలక నేత వ్యాఖ్యలు
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. ఎమ్మెల్యేను బహిష్కరించిన కాంగ్రెస్