తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ద్రౌపదీ ముర్ము ఘన విజయం.. రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్న తొలి ఆదివాసీ మహిళ - యశ్వంత్​ సిన్హా

President election 2022 result: ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపొందారు. దేశ అత్యున్నత పదవి చేపడుతున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈనెల 25న ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.

draupadi murmu
ద్రౌపదీ ముర్ము

By

Published : Jul 21, 2022, 7:54 PM IST

Draupadi Murmu president of India: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఊహించినట్లుగానే ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై ముర్ము భారీ ఆధిక్యం సంపాదించారు. క్రాస్​ ఓటింగ్​ కూడా కలిసి రాగా.. ఊహించిన దానికంటే అధిక మెజార్టీ లభించింది. ఈ విజయంతో ముర్ము.. రాష్ట్రపతి పీఠమెక్కే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపదికి.. ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్​ గవర్నర్​గా సేవలు అందించిన అనుభవం ఉంది. ముర్ము ఈనెల 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం ఈనెల 24తో ముగుస్తుంది.

  • తొలి రౌండ్​లో మొత్తం 748 మంది ఎంపీల ఓట్లను లెక్కించారు. ద్రౌపది.. 3,78,000 విలువైన 540 ఓట్లు దక్కించుకున్నారు. సిన్హాకు 1,45,600 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.
  • రెండో రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.
  • మూడో రౌండ్‌ ముగిసే సమయానికి ద్రౌపదీ ముర్ము 50శాతం మార్కును దాటారు. మూడో రౌండ్‌లోనూ ద్రౌపదీముర్ముకు ఆధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు పోలయ్యాయి. దీంతో ద్రౌపదీముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్‌ సి‌న్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062.

ప్రధాని భేటీ:ముర్ము విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెతో భేటీ కానున్నారు. రాష్ట్రపతిగా విజయం సాధించిడంపై ఆమెను అభినందించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా చీఫ్​ జేపీ నడ్డా సహా పలువురు నేతలు కూడా ముర్మును కలిసే అవకాశం ఉంది. సోమవారం ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో జేపీ నడ్డా పార్టీ నేతలు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపు ఇలా: ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రెండు వేర్వేరు రంగుల్లో బ్యాలెట్​ పేపర్లను పంపిణీ చేశారు నిర్వహకులు. ఈ పేపర్లను వేరు చేయడం ద్వారా లెక్కింపును చేపట్టారు అధికారులు. మొదట ఎంపీ.. ఆ తర్వాత ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరిగాయి. ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరిగింది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడించారు. ఎంపీ ఓటు విలువ 700కాగా.. ఎమ్మెల్యే ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలు ఈనెల 18న పార్లమెంటు సహా దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగాయి.

ఇదీ చూడండి:'వాటి సంగతేంటి?'.. సోనియాకు 2 గంటల్లో ఈడీ 20 ప్రశ్నలు! కాంగ్రెస్​ పోరుబాట!!

ABOUT THE AUTHOR

...view details