President election 2022: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు. దాఖలైన 115 నామినేషన్లలో 107 పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగినట్టు లేకపోవడమే అందుకు కారణం.
రాష్ట్రపతి అభ్యర్థులు ముర్ము, సిన్హా ఇద్దరూ చెరో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారని.. వాళ్ల నామినేషన్‌ను ఇప్పటికే ఆమోదించామని పీసీ మోదీ తెలిపారు. జులై 18న ఓటింగ్‌ను పార్లమెంట్‌లోని 63 నెంబరు గదిలో నిర్వహిస్తామని.. రాష్ట్ర అసెంబ్లీలలో నిర్దేశించిన రూముల్లో జరుపుతామని వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ సాగుతుందని పేర్కొన్నారు.