తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. ముర్ముకే జై!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పలు రాష్ట్రాల శాసనసభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ముర్ము విజయం ఖాయమనే వార్తలు వినిపిస్తుండగా... తాజాగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఎన్​డీఏ అభ్యర్థిని గెలుపునకు మరింత బలం చేకూర్చాయి. తమ పార్టీ విధానాన్ని ధిక్కరించి మరీ ముర్ముకు ఓటు వేసినట్లు పలువురు ఎమ్మెల్యేలు ప్రకటించారు.

PRESIDENT ELECTION CROSS VOTING
PRESIDENT ELECTION CROSS VOTING

By

Published : Jul 18, 2022, 9:33 PM IST

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఝార్ఖండ్‌, గుజరాత్‌కు చెందిన ఎన్​సీపీ ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేశామని వెల్లడించగా.. హరియాణా, ఒడిశా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ముర్ముకు మద్దతుగా నిలిచామని తెలిపారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించగా, అసోంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటు వేశారని ఐయూడీఎఫ్ ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భూయాన్ వెల్లడించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తన మనస్సాక్షి ప్రకారమే ఓటు వేశానని హరియాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో శివపాల్ సింగ్ యాదవ్... సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ముర్ముకు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. ముర్ము ఒడిశా కుమార్తె అని.. అందుకే ఆమెకు అనుకూలంగా ఓటు వేశానని ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ ప్రకటించడం కలకలం రేపింది. ఝార్ఖండ్‌లో ఎన్​సీపీ ఎమ్మెల్యే కమలేష్ సింగ్ ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు తెలిపారు. ఝార్ఖండ్‌లో ద్రౌపది ముర్ముకు అనుకూలంగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారని భాజపా ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ ప్రకటించారు. గుజరాత్‌లో ఎన్​సీపీ ఎమ్మెల్యే కంధాల్ జడేజా ముర్ముకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలిపారు.

వైకాపా, తెదేపా, బిజద, బీఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ముర్ముకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో ముర్ముకు ఓట్ల శాతం.... భారీగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలున్నాయి. మొత్తం 10,86,431 ఓట్లలో ముర్ముకు అనుకూలంగా ఏడు లక్షలకు పైగా ఓట్లు వస్తాయని భాజాపా భావిస్తోంది. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకు గాను... రామ్‌నాథ్ కోవింద్‌కు 7 లక్షల 2 వేల 44 ఓట్లు రాగా..... మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details