పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారి బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి సైనిక సంప్రదాయాల ప్రకారం పార్లమెంటుకు చేరుకున్నారు. రైసీనా హిల్స్ నుంచి అశ్వదళాలు ముందు సాగుతుండగా భారీ కాన్వాయ్‌లో ఆమె పార్లమెంటు భవనానికి తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కఢ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అనంతరం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తిచేసుకున్నామని, రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని తెలిపారు. దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోందన్న రాష్ట్రపతి.. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. NDA సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనతో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. దేశం రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని.. ఆజాదీ కా అమృత్ కాలంలోకి ప్రవేశించింది. అమృత కాలంలో వచ్చే 25 ఏళ్లు.. వందేళ్ల స్వాతంత్ర్య ఆకాంక్షల సాధనకు.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి చాలా ముఖ్యమైనవి. ఇది యుగ నిర్మాణ సమయం. దీని కోసం మనమందరం పూర్తి సామర్థ్యంతో కార్యచరణ ప్రారంభించాలి. 2047 నాటికి.. మనం పూర్వ వైభవానికి సంబంధించిన.. ఆధునికత కలిగిన సువర్ణ అధ్యాయం కలిగిన దేశాన్ని నిర్మించాలి. మనం ఆత్మనిర్భర్ భారత్‌తో.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల దేశాన్ని నిర్మించాలి"
--ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి
అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కొనియాడిన రాష్ట్రపతి..మూడు కోట్లమందికి సొంత ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. మహిళా సాధికారతను చర్యలు పడుతున్నట్లు తెలియజేసిన ద్రౌపదీ ముర్ము సైన్యంలోనూ అవకాశాలు కల్పించినట్లు గుర్తుచేశారు. ఇదేసమయంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నట్లు పేర్కొన్న రాష్ట్రపతి..కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.