Draupadi Murmu Address Nation: 'దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయ్.. మహిళలు అనేక అడ్డంకులను అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నార'ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశానికి అతి పెద్ద ఆశాదీపాలు మన పుత్రికలేనన్నారు. స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రలజందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమన్నారు. " భారత్ 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోంది. 1947 ఆగస్టు 15న వలస పాలన సంకెళ్లను తెంచుకున్నాం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవం జరుపుకొంటున్నాం. మన స్వాతంత్ర్య సమరయోధులందరికీ వందనాలు. మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం వారంతా తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంగా మన మహనీయులందరినీ మరోసారి స్మరించుకుందాం. దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న స్మృతి దివస్ జరుపుకొంటున్నాం. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్నాం" అని ఆమె అన్నారు.
''కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఈ క్లిష్ట సమయాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే భారత్ ఓ మార్గదర్శిలా నిలిచింది. అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్‌లోనూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం. అంకుర సంస్థలతో భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం పెనుమార్పులు తీసుకొచ్చింది. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నాం. దేశంలో స్త్రీ-పురుష సమానత్వాన్ని సాధించాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను చేపట్టాం. గత నెలలో 200 కోట్ల వ్యాక్సిన్ మార్కును అధిగమించాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ సాధించిన విజయాలు ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఎక్కువే.''
-ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి