President Draupadi Murmu Address To Nation : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడారు. తిరంగ జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు. దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వివరించారు. భారత్.. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు.
'మన అన్నదాతలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. భారత దేశ ఆర్థిక వృద్ధిపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఉంది. దేశంలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంలో భారీ సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చాం. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.
"మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడుతున్నారు. మహిళల ఆర్థిక సాధికారతపై దేశంలో ప్రత్యేక దృష్టి సారించడం పట్ల నేను సంతోషపడుతున్నాను. ఆర్థిక సాధికారత వల్ల కుటుంబంలో సమాజంలో మహిళల స్థానం బలోపేతం అవుతోంది. ఈ సంవత్సరం చంద్రయాన్-3ను ప్రయోగించాం. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టే సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టాం. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టాం. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది"
--ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి