మహమ్మారిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయనే విషయాన్ని కరోనా బోధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఆరోగ్య భద్రత, శాంతి' సదస్సుకు ఆయన వర్చువల్గా హాజరయ్యారు.
"ఈ సంక్షోభ సమయంలో... ప్రమాద నిర్వహణ, ఉపశమన చర్యలు అనే రెండు అంశాల్లో ప్రపంచ దేశాల దేశాల మధ్య మరింత బలమైన సహకారం అవసరమని తేలింది. వనరులను పంచుకుంటూ.. ఒకరి సామర్థ్యాన్ని మరొకరు వినియోగించుకోవటం ద్వారా ఇలాంటి ప్రతికూల పరిస్థితులపై విజయం సాధించవచ్చు. మహమ్మారి చూపించే ప్రభావంతో పోలిస్తే.. దానిని ఎదుర్కొనేందుకు అయ్యే ఖర్చు తక్కువే. అందుకు తగ్గట్లుగా మనం ముందుగానే సిద్ధమై ఉంటే.. ఎన్నో లాభాలు కలుగుతాయని కరోనా మహమ్మారి మనకు బోధించింది."
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి