దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన తరుణంలో.. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు.. తమ పరిధిలోని ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థల జాబితాను సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను పెంచేందుకు మూతపడిన ప్లాంట్లను పునరుద్ధరించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచిస్తూ లేఖ రాసింది.
ప్రత్యేక కారిడార్లతో..
ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలను తగిన భద్రత కల్పించడం సహా.. ప్రత్యేక కారిడార్ల సదుపాయాలు కల్పించాలని లేఖలో పేర్కొంది కేంద్రం. ప్రజారోగ్యానికి సంబంధించిన వస్తువులకు నిరంతర సరఫరా, రవాణాను కల్పించాలని ఆదేశించింది. ఆక్సిజన్ తరలింపునకు అవసరమైన అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచేందుకు సింగపూర్, యూఏఈ వంటి విదేశాలను సంప్రదించామని హోం శాఖ తెలిపింది. భారత వైమానిక దళాల ద్వారా సరఫరా చేయగలిగే అధిక సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.
దేశంలో పలు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని, వాటిని స్థానిక ఆస్పత్రులకు ప్రాణవాయువు సరఫరా చేసేందుకు వినియోగించుకోవాలని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా ఓ ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు. అలాంటి ప్లాంట్లన్నింటినీ గుర్తించటం సహా.. ఆక్సిజన్ ఉత్పత్తయ్యే అన్ని ప్లాంట్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లుకు సూచించాలని కోరారు. మూతపడిన ప్లాంట్ల పునరుద్ధరణ కోసం తగు చర్యలు చేపట్టాలని భల్లా సూచించారు. వీటన్నింటిపై తక్షణ చర్యలు తీసుకోవడం సహా.. సంబంధిత నివేదికను అత్యవసరంగా పంపాలని ఆయన ఆదేశించారు.