తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్టీలో ఉండే కౌరవుల లిస్ట్‌ తయారు చేయండి' - భాజపాను విమర్శించిన రాహుల్​ గాంధీ

RAHUL GANDHI NEWS: గుజరాత్​ కాంగ్రెస్​ నాయకులపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేయని వారినుద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని కౌరవులతో పోల్చారు. వచ్చే ఎన్నికల కోసం వారి జాబితాను సిద్ధం చేయాలని అన్నారు.

rahul Gandhi
రాహుల్​ గాంధీ

By

Published : Feb 27, 2022, 4:54 AM IST

RAHUL GANDHI NEWS: గత అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో త్రుటిలో అధికార పీఠాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ను ఈ సారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన.. డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. శనివారం పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేయని వారినుద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని కౌరవులతో పోల్చారు. అలాగే, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాపైనా విరుచుకుపడ్డారు.

సీబీఐ, ఈడీ, మీడియా, పోలీస్‌, గూండాలను భాజపా ప్రతిరోజూ ఉపయోగిస్తోందని రాహుల్‌ అన్నారు. వారికి త్వరలోనే గుజరాత్‌ ప్రజలు సత్యాన్ని ప్రబోధిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే విజయం సాధించిందని, నాయకులు ఆ వాస్తవాన్ని అంగీకరించాలని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ నేతలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీలో రెండురకాల నేతలు ఉంటారు. ఒకరు పార్టీ కోసం నిరంతరం క్షేత్ర స్థాయిలో కష్టపడుతుంటారు. రెండో రకం వారు నిత్యం ఏసీ గదులల్లో కూర్చుని మాట్లాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప ఏమీ చేయరు. వారు కౌరవులు. అలాంటి వారి జాబితా తయారు చేయండి. వారిని భాజపా లాక్కుంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలంటే మనకు కావాల్సింది ఓ ఐదుగురు పాండవులు మాత్రమే' అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఏడు స్థానాలతో అధికారం కోల్పోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. గుజరాత్‌ ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details