హత్యాయత్నం కేసులో జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లిన ఓ గర్భవతి గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లోని భాగల్పుర్ జిల్లాలో జరిగింది. గోగా పట్టణానికి చెందిన పల్లవి, గోవింద్ యాదవ్‌లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి జీవితం ఆనందంగా సాగిపోతున్న సమయంలో గోవింద్ హత్యాయత్నం కేసులో అరెస్టయ్యాడు. ఏడు నెలల నుంచి జైలులోనే ఉన్నాడు. దీంతో పల్లవి మనస్తాపనికి గురైంది. బిడ్డను కనడానికి ముందు భర్తను కలవలనుకుంది.
గర్భవతిగా ఉన్న పల్లవిని జైలుకు పంపడానికి ఇష్టపడని ఆమె అత్తమమాలు అందుకు నిరాకరించారు. కానీ ఆమె పట్టుపట్టడంతో వారు కాదనలేకపోయారు. దీంతో పల్లవి మంగళవారం భర్తను చూసేందుకు జైలుకు వెళ్లింది. కాసేపు భర్తతో కష్టసుఖాలు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నేలపై పడిపోయింది. ఇది గమనించిన అక్కడి సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధరించారు.
'పల్లవి యాదవ్ అనే మహిళ తన భర్త గోవింద్ యాదవ్ అలియాస్ గుడ్డు యాదవ్‌ను కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించి అక్కడే నేలపై పడింది. ఆ తర్వాత చనిపోయింది. ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది' అని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తప్పుడు కేసులో తమ కుటుంబ సభ్యుడిని ఇరికించారని జైలులో ఉన్న వ్యక్తి బంధువులు ఆరోపిస్తున్నారు.