రవాణా సదుపాయం లేక దుప్పటినే డోలీగా మార్చి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన ఘటన మహారాష్ట్ర భివండీ తాలుకాలోని ధరనిచా పఢాలో జరిగింది. అయితే ఆరోగ్య కేంద్రానికి చేరుకునేలోపే గర్భిణీ ప్రసవించి.. చిన్నారి మరణించింది. దీంతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది.
అసలేం జరిగిందంటే.. ధరనిచా పఢా గ్రామానికి చెందిన దశార్నా అనే గర్భిణీకి గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆ గ్రామానికి రవాణా సౌకర్యాలు లేవు. దీంతో గ్రామస్థులు, బంధువులు కలిసి.. దుప్పటినే డోలీగా మార్చారు. గర్భిణీని అందులో పెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న దిషూషి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడవి దారిలో నీటిలో నుంచే నడుచుకుంటూ డోలీని మోసుకెళ్లారు. అయితే, దారి మధ్యలో దుప్పట్లోనే గర్భిణీ ప్రసవించింది. దురదృష్టవశాత్తు చిన్నారి మరణించింది. దీంతో కుటుంబం, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్లే గర్భిణీ తీవ్ర ఇబ్బందులు పడిందని.. గ్రామస్థులు వాపోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని తెలిపారు. ప్రతిసారీ రోగులు, గర్భీణీలు ప్రధాన రహదారికి చేరుకోవాలంటే కిలోమీటరు నడవాల్సి వస్తోందని అన్నారు. ఆ ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందనే లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కనికరించి గ్రామానికి రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.