దిల్లీ బవానాలో దారుణం జరిగింది. చలిమంట వద్ద కూర్చున్న గర్భిణీ సహా ఆమె భర్తకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని హుటాహుటిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఓ బాలుడు మంటల్లో పెయింట్ తిన్నర్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే.. భర్త, అత్తమామలు ఆమెను వేధిస్తున్నారని దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మల్వాల్ ఆరోపించారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
ఇదీ జరిగింది
శుక్రవారం రాత్రి భర్త వీర్ ప్రతాప్, ఏడు నెలల గర్భిణి భార్య ఖుష్బూ, ఓ బాలుడు కలిసి చలిమంట వేసుకుని కుర్చున్నారు. మంట ఆరిపోయే సమయంలో పెయింట్ తిన్నర్ వేస్తూ ఆరిపోకుండా చూస్తున్నారు. అకస్మాత్తుగా బాలుడు తిన్నర్ను మొత్తం వేయడం వల్ల భార్యాభర్తలిద్దరికీ మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలపాలైన వీరిని హుటాహుటిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. భర్త, అత్తమామలు కలిసి తన సోదరిని వేధిస్తున్నారని.. వారే నిప్పంటించారని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. బాధితురాలి వాంగ్మూలం తీసుకోగా ఆమె ప్రమాదేమనని ధ్రువీకరించిందని పోలీసులు తెలిపారు.
మహిళపై పెట్రోల్ పోసి నిప్పు
ఝార్ఖండ్ హజారీబాగ్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించారు నలుగురు దుండగులు. ఇందుకు ఆమె ప్రతిఘటించడం వల్ల పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన హజారీబాగ్ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల రిమ్స్‌కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. నిందితులంతా బాధితురాలి బంధువులేనని పోలీసులు తెలిపారు.