దేశంలో ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం 7 దాటిందంటే ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే ఓ గర్భిణీ మాత్రం ఇంత వేసవిలోనూ 7 కిలోమీటర్లు నడిచి వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నడిచివెళ్లింది. దీంతో ఆమె వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో సోమవారం జరిగింది.
ఇదీ జరిగింది..
పాల్ఘర్లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్( 21) అనే గర్భిణీ జనరల్ చెకప్ కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయలుదేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుంది. అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ వైద్య సేవలు అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరింది. అయితే అప్పటికే ఎండలు భగభగమంటున్నాయి. తిరిగి ఆటోలో బయలుదేరి హైవేపై దిగి కాలి నడకన స్వగ్రామానికి బయలుదేరింది. ఎలాగోలా మెల్లగా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది.
అయితే సోనాలి వడదెబ్బ వల్ల తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారు అక్కడ సోనాలికి ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. సోనాలిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది.