ఒడిశా రాయగడలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఓ గర్భిణీ మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
రాయగడకు చెందిన బైద్య నాయక్, సులబతి నాయక్(30) భార్యభర్తలు. వీరికి 10 ఏళ్ల కుమార్తె ఉంది. బైద్య నాయక్ వృత్తిరీత్యా రోజువారి కూలీ. సులబతి నాయక్.. తొమ్మిది నెలల గర్భిణీ. గతేడాది డిసెంబరు 26న ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొంది. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. అందులో సులబతి ఒకరు.
సులబతి నాయక్‌ను రాయగడలోని జైలుకు తరలించారు పోలీసులు. 16 రోజుల శిక్ష అనంతరం బెయిల్‌పై మంగళవారం విడుదలైంది. జైలు నుంచి విడుదలవ్వగానే సులబతికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను హుటాహుటిన రాయగడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బుధవారం రాత్రి ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం సులబతి ఆరోగ్యం విషమించడం వల్ల వైద్యులు.. ఆమెను కోరాపుట్‌లోని ఎల్ఎల్ఎన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే గురువారం వేకువజామున సలబతి మరణించింది. ఆమెకు జన్మించిన శిశువు రాయగడలోని ప్రభుత్వాస్పత్రిలో శిశు సంరక్షణ యూనిట్లో ఉన్నాడు.