ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. రుణ వాయిదా చెల్లించలేదని ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన రికవరీ ఏజెంట్ల దుశ్చర్యకు ఓ రైతు కుమార్తె, మూడు నెలల గర్భిణీ బలైంది. అసలే జరిగిందంటే..
పోలీసుల సమాచారం ప్రకారం..జిల్లాలోని ఇచక్ ప్రాంతానికి చెందిన మిథిలేశ్ అనే రైతు.. స్థానికంగా ఓ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అయితే ఈ నెల కట్టాల్సిన రుణ వాయిదాను అతడు కొన్ని కారణాల వల్ల చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు ట్రాక్టర్‌ను జప్తు చేసుకోవడానికి గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో మిథిలేశ్ ట్రాక్టర్.. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉంది. దాన్ని స్వాధీనం చేసుకుని లోన్ రికవరీ ఏజెంట్లు బయలుదేరారు. వెంటనే మిథిలేశ్, అతడి కుమార్తె మోనిక.. డబ్బును తీసుకుని ట్రాక్టర్ వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో కారు నుంచి దిగిన ఓ రికవరీ ఏజంట్.. రూ.1,30,000 తీసుకుని ఆఫీసుకు రమ్మని చెప్పాడు. అప్పుడు మిథిలేశ్ తాను ఇప్పుడు డబ్బులు తెచ్చానని, గుర్తింపు కార్డు చూపించమని అడిగాడు. దీంతో కోపం పెంచుకున్న రికవరీ ఏజంట్.. 'నేనో ఫైనాన్స్ కంపెనీ జోనల్ మేనేజర్.. నన్నే ఐడీ కార్డ్ అడుగుతావా?' అంటూ వాగ్వాదానికి దిగాడు. ట్రాక్టర్ స్పీడ్‌గా తీసుకెళ్లమని మరో వ్యక్తికి చెప్పాడు. అదే సమయంలో మోనిక.. ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించగా.. ఆమెపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చాడు డ్రైవర్.
వెంటనే మిథిలేశ్.. తన కుమార్తెను స్థానిక ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ చౌత్ తెలిపారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో.. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు చట్ట పరిధిలో డబ్బు రికవరీ చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.