precautions dose time: కొవిడ్-19 టీకా ప్రికాషన్ డోసు తీసుకునేందుకు వ్యవధిని కుదించాలని కేంద్రం ఆలోచిస్తోంది. రెండో డోసు తర్వాత ప్రికాషన్ డోసు తీసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న 9 నెలల వ్యవధిని త్వరలోనే ఆరు నెలలకు తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రోగనిరోధకతపై.. జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) ఏప్రిల్ 29న సమావేశమై ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్టీఏజీఐ ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎన్టీఏజీఐ ప్రతిపాదనల మేరకు తుది నిర్ణయం వెలువడనుందని తెలిపాయి.
కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు ఐసీఎంఆర్ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు తేల్చాయి. బూస్టర్ డోస్ ఇవ్వటం ద్వారా రోగనిరోధక శక్తి స్పందన మెరుగవుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకున్న వారు ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు.