Prathipadu TDP In charge Varapula Raja Passes Away: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం చెందారు. వరుపుల జోగిరాజు అలియాస్ రాజాకు గుండెపోటు రావడంతో ప్రత్తిపాడు నుంచి హుటాహుటిన కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకోగానే రాజా కుప్పకూలారు. వెంటనే వైద్యం ప్రారంభించినా ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు. 47 ఏళ్ల రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాలూరు, బొబ్బిలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ తరఫున పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ మధ్యాహ్నం ప్రచారం ముగించుకొని శనివారం సాయంత్రం ప్రత్తిపాడు చేరుకున్నారు.
కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో పలు విషయాలపై మాట్లాడుతుండగా.. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కాకినాడకు తరలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకోగానే రాజా కుప్పకూలిపోయారు. రాజా స్వగ్రామం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి. తాత జోగిరాజు 1972లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఐదు దశాబ్దాలకుపైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కుటుంబం వీరిది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆప్కాబ్ వైస్ ఛైర్మన్‌గా సేవలు అందించారు.
2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజా ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌పై ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొనేవారు. రాజాను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా గతంలోనే నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇటీవల ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజా ఆధ్వర్యంలో వందల సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరాయి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్న వేళ వరుపుల రాజా హఠాన్మరణం చెందడం పార్టీ నాయకులు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
"హాస్పిటల్‌కు వచ్చే వరకూ బతికే ఉన్నారాయన. డోర్ ఇలా తీసేసరికి కింద పడిపోవడం జరిగింది. హాస్పిటల్లో కూడా పెద్ద ప్రయత్నం చేశారు. కానీ ప్రాణం దక్కలేదు. భవష్యత్తులో రాజకీయంగా గొప్ప నాయకుడు కావాలసిన వ్యక్తి. ఎప్పడు చురుకుగా, ప్రజాసేవలో ఉంటాడు. ప్రజాసేవలో తిరుగుతూనే మరణించాడని నేను భావిస్తాను... పార్టీకి తీరని లోటు." -కొండబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే